పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్
అనంతపురం (అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్) : ప్రభుత్వ సేవలందించి పదవీ విరమణ చేసిన పెన్షనర్ల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ సూచించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఏజీ) ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ ప్రారంభమైంది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పెన్షనర్లు తమ సేవా కాలంలో అందించిన సేవలను గుర్తించి, వారి సమస్యల పరిష్కారానికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలోనే సమస్యలను గుర్తించి పరిష్కరించేలా ఏజీ కార్యాలయం చేపట్టిన కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు.
ఏజీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతి ప్రియ మాట్లాడుతూ, పెన్షన్, జీపీఎఫ్కు సంబంధించిన సమస్యలను పరిష్కరించడమే అదాలత్ లక్ష్యమన్నారు. గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రెండో రోజు కార్యక్రమం కొనసాగుతుందని, ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగులు, పెన్షనర్లు హాజరై తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పెన్షనర్లు పాల్గొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.