telanagana
బకాయి మిల్లర్ల ఆస్తుల జప్తునకు పౌరసరఫరాల శాఖ సిద్ధం
హైదరాబాద్,మేజర్ న్యూస్ ప్రతినిధి: ప్రభుత్వానికి చెల్లించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిల వసూళ్లపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ దృష్టి సారించింది. బకాయిలు చెల్లించని రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ప్రభుత్వానికి అందించాల్సిన బియ్యం లేదా ధాన్యాన్ని నిర్దేశిత గడువులోగా అందించని మిల్లర్ల ఆస్తులను జప్తు చేయడంతోపాటు, అవసరమైతే మిల్లుల్లోని యంత్రాలను వేలం వేసి బకాయిలు రాబట్టేందుకు రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్) చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫీషియో ముఖ్య కార్యదర్శి ఎం. స్టీఫెన్ రవీంద్ర మంగళవారం క్షేత్రస్థాయి అధికారులకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఈ చర్యల అమలుపై దిశానిర్దేశం చేశారు. మూడు బ్యాచ్‌లుగా పాల్గొన్న డిప్యూటీ తహసీల్దార్లకు బకాయిల గుర్తింపు, ఆస్తుల వివరాల సేకరణ, చట్టపరమైన ప్రక్రియలు, తనిఖీల నిర్వహణపై సూచనలు ఇచ్చారు. విధుల నిర్వహణలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, నిజాయితీగా పనిచేసే అధికారులకు శాఖ పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆకస్మిక తనిఖీలకు ప్రత్యేక ప్రణాళిక
బకాయి మిల్లర్ల వ్యవహారాల్లో వాస్తవ పరిస్థితులను గుర్తించేందుకు ఫిజికల్ వెరిఫికేషన్ (పీవీ) మొబైల్ యాప్‌ను వినియోగించనున్నారు. ప్రతి బుధవారం క్షేత్రస్థాయి బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. మిల్లుల్లో నిల్వలు, యంత్రాలు, ఇతర ఆస్తుల వివరాలను పరిశీలించి, అవసరమైన డిజిటల్ ఆధారాలను సేకరించే విధానంపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. తద్వారా బకాయిల వసూలు కోసం చేపట్టే చట్టపరమైన చర్యలకు అవసరమైన సమాచారాన్ని పకడ్బందీగా నమోదు చేయనున్నారు. శిక్షణలో భాగంగా అధికారులకు ప్రాక్టికల్ మాక్ టెస్టులు కూడా నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే పరిస్థితులను సమర్థవంతం గా ఎదుర్కొనేలా తనిఖీలు, ఆధారాల నమోదు, తదుపరి చర్యలపై అవగాహన కల్పించారు.
జిల్లా అధికారులకూ శిక్షణ
బకాయిల వసూలు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు తదుపరి దశలో జిల్లా పౌరసరఫరాల అధికారులు (డీసీఎస్‌వోలు), జిల్లా మేనేజర్లకు కూడా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బకాయిల వివరాలను సమీక్షిస్తూ, ప్రభుత్వానికి రావాల్సిన బియ్యం లేదా వాటికి సంబంధించిన బకాయిలను నిబంధనల ప్రకారం రాబట్టడమే లక్ష్యంగా శాఖ చర్యలు చేపడుతోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిల విషయంలో నిర్లక్ష్యం వహించే మిల్లర్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఆస్తుల జప్తు, యంత్రాల వేలం వంటి చర్యలను వర్తించే చట్టపరమైన ప్రక్రియలకు అనుగుణంగా చేపట్టనున్నట్లు పేర్కొంది.