ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు - సురక్షితంగా బాలుడి అప్పగింత. - ముగ్గురు నిందితుల అరెస్ట్
అనపర్తి, మేజర్ న్యూస్:ఐదేళ్ల పసివాడి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. ఆర్థిక అవసరాల కోసం బాలుడిని అపహరించి, హైదరాబాద్‌కు తరలించి విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురు నిందితుల కుట్రను అనపర్తి పోలీసులు ఛేదించారు. సుమారు 15 రోజుల పాటు పది ప్రత్యేక పోలీసు బృందాలు అహర్నిశలు శ్రమించి బాలుడిని సురక్షితంగా రక్షించడంతో పాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వర్షాలు, తుఫానుల కారణంగా సీసీ కెమెరాల ఫుటేజీ స్పష్టంగా లభించకపోయిన సాంకేతిక ఆధారాలు, రవాణా మార్గాలపై పరిశీలనతో పోలీసులు కేసును ఛేదించారు. అనపర్తి శివారులో ఎలుకలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్న రాసూరు బ్రహ్మరాజు, పద్మ దంపతుల ఐదేళ్ల కుమారుడు కృష్ణ గత నెల 23వ తేదీన అదృశ్యమయ్యాడు.
తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో బాలుడు కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అనపర్తి పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు.బాలుడి ఆచూకీ కోసం మొదట ఐదు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టిన పోలీసులు, కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దర్యాప్తును విస్తరించారు. మొత్తం పది ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి వివిధ కోణాల్లో విచారణ జరిపాయి. వర్షాలు, తుఫానుల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీ స్పష్టంగా లేకపోవడం దర్యాప్తులో సవాలుగా మారింది. అయినప్పటికీ పోలీసులు వెనుకడుగు వేయకుండా సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు.
బాలుడిని తరలించేందుకు ఉపయోగించినట్లు గుర్తించిన ఆటోలు, బస్సుల మార్గాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలో బాలుడు పిఠాపురంలో ఉన్నట్లు గుర్తించి, అతడిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ద్వారపూడికి చెందిన ఇండుగమల్లి కుమారి, పిఠాపురానికి చెందిన మోర్తా నాగార్జున, పిఠాపురంలో నివసిస్తున్న కోరుకొండకు చెందిన ఏడిద విజయ్‌కుమార్ కలిసి బాలుడి కిడ్నాప్‌కు పథకం రచించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరిలో ఏడిద విజయ్‌కుమార్‌పై గతంలో నేర చరిత్ర ఉన్నట్లు, అతను రౌడీషీటర్‌గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.బాలుడిని అపహరించిన అనంతరం పిఠాపురంలో దాచి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించి విక్రయించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది
. ఈ సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు పక్కా ప్రణాళికతో చర్యలు చేపట్టి బాలుడిని సురక్షితంగా రక్షించారు. ఈ కేసులో సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అనపర్తి సీఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ బి. విద్య, సీఐ సుమంత్‌తో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు 15 రోజుల పాటు నిరంతరంగా శ్రమించారని తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ సాంకేతిక ఆధారాలను ఉపయోగించి బాలుడిని సురక్షితంగా రక్షించడం పట్ల దర్యాప్తు బృందాన్ని అభినందించారు.
కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన సీఐ సుమంత్, ఎస్సై బి. వినయ్ ప్రతాప్‌తో పాటు ప్రత్యేక పోలీసు బృందాల సిబ్బందిని డీఎస్పీ ప్రశంసించారు. పిల్లల అక్రమ రవాణా, కిడ్నాప్ వంటి నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.15 రోజుల పాటు తమ బిడ్డ ఎక్కడ ఉన్నాడో తెలియక ఆందోళనతో గడిపిన తల్లిదండ్రులకు బాలుడు సురక్షితంగా తిరిగి రావడంతో ఊరట లభించింది. తమ కుమారుడు క్షేమంగా తమ ఒడికి చేరడంతో తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. బాలుడిని గుర్తించి రక్షించేందుకు నిరంతరం శ్రమించిన పోలీసులకు కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు.ఒక చిన్నారి అపహరణతో ప్రారంభమైన ఈ ఘటన, పోలీసుల నిరంతర గాలింపు, సాంకేతిక ఆధారాల విశ్లేషణతో సుఖాంతం కావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.