అమృతమ్మ హత్య కేసులో మరో కీలక పరిణామం
మరో వ్యక్తిపై అనుమానం.. దర్యాప్తు కొనసాగింపు
సాంకేతిక ఆధారాలతో నిందితుడి అరెస్ట్..
కుల్కచర్ల, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 04):
కుల్కచర్ల మండలం చెల్లాపూర్‌కు చెందిన గంధం అమృతమ్మ (34) హత్య కేసులో పోలీసులు మరో కీలక విషయాలను ఆదివారం ఎస్ఐ రమేష్ కుమార్ వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం, మొబైల్ ఫోన్ సమాచారం, ఇతర ఆధారాల ఆధారంగా అదే గ్రామానికి చెందిన మంగలి ఆనంద్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అమృతమ్మ, ఆనంద్‌కు గతంలో పరిచయం ఉండగా, డబ్బులు, వెండి ఆభరణాల లావాదేవీల విషయంలో వారి మధ్య వివాదం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. సెప్టెంబర్ 18న అమృతమ్మను ఆనంద్ ద్విచక్రవాహనంపై వెన్నచేడు గ్రామ శివారులోని చెరువు ప్రాంతానికి తీసుకెళ్లినట్లు సాంకేతిక ఆధారాలతో పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని గుర్తించకుండా చేసేందుకు తగలబెట్టి, అవశేషాలను మరో ప్రాంతానికి తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో బంధువైన మంగలి మహేష్ సహకరించినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ, అతని పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. కేసులో మొబైల్ ఫోన్ డేటా, సీసీటీవీ ఫుటేజీ, వాహనం, ఫోరెన్సిక్ ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అరెస్టు చేసిన ఆనంద్‌ను కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
రిపోర్టర్ వడ్ల వినోద్ కుమార్.