పోరంకి–కానూరుకు రూ.34.92 కోట్ల అభివృద్ధి పనులు..
తాడిగడప రూపురేఖలు మారుస్తాం..
పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్
తాడిగడప, మేజర్ న్యూస్ : తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. పోరంకి, కానూరు ప్రాంతాల్లో రూ.34.92 కోట్లతో చేపట్టనున్న 94 సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోరంకిలో రూ.9.14 కోట్లతో 13, కానూరులో రూ.25.78 కోట్లతో 81 సిమెంట్ రోడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన తాడిగడప మున్సిపాలిటీలో ప్రజలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న రోడ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని చెప్పారు. మట్టి రోడ్లు లేని మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులను దశలవారీగా చేపడుతున్నామని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ బలోపేతానికి అదనంగా రూ.50 కోట్ల నిధులు తీసుకొచ్చామని, జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తూ పనులు చేపట్టి ఏడాది నుంచి ఏడాదిన్నరలోపు అధిక భాగం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లలో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అభివృద్ధి అంటే శంకుస్థాపనల ఫొటోలు కాదని, ప్రజలు ప్రతిరోజూ ఉపయోగించే పక్కా రోడ్లు, సమర్థవంతమైన డ్రైనేజీ, సురక్షితమైన మంచినీటి సదుపాయాలేనని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో రాబోయే 10–12 ఏళ్లలో తాడిగడప మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని బోడే ప్రసాద్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ.