మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి విద్యార్థులకు న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు
రేపల్లె మేజర్ న్యూస్;, యువత మత్తు పదార్థాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని వక్తలు సూచించారు. రేపల్లె పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, వాటి నియంత్రణకు సంబంధించిన చట్టాలపై న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు.
రేపల్లె మండల న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పద్మావతి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రేపల్లె కోర్టు పారా లీగల్ వాలంటీర్లు సీహెచ్. నాగమల్లేశ్వరరావు, వి. బాబురావు, న్యాయవాది గుమ్మడి కుమార్ బాబు విద్యార్థులకు ఉచిత న్యాయ సహాయం ప్రాధాన్యతను వివరించారు. ఉచిత న్యాయ సహాయం పొందే విధానం, దాని ద్వారా కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
గంజాయి సహా ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అధ్యాపకులు బి. శ్రీనివాసరావు, అనిల్ బాబు, వై. నరసింహారావు, సిబ్బంది మేడికొండ దాసు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.