ముంబైలో జరిగిన 3వ వరల్డ్ మేయర్స్ ఫోరమ్‌కు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాల స్వామి హాజరు.
విజయనగరం మేజర్ న్యూస్:
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ముంబైలో నిర్వహించిన 3వ వరల్డ్ మేయర్స్ ఫోరమ్‌కు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ బాల స్వామి గారు హాజరయ్యారు.
1926లో స్థాపించబడిన ఏ ఐ ఐ ఎల్ ఎస్ జీ సంస్థ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 2025 సెప్టెంబర్ నుంచి 2026 నవంబర్ వరకు దేశంలోని వివిధ నగరాల్లో శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగా నవంబర్ 25 నుంచి 27 వరకు ముంబైలోని ఫెయిర్‌మాంట్ హోటల్‌లో 3వ వరల్డ్ మేయర్స్ ఫోరమ్ అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు.
ఈ అంతర్జాతీయ సదస్సులో దేశవిదేశాలకు చెందిన మేయర్లు, ప్రజాప్రతినిధులు, విధాన రూపకర్తలు, విద్యావేత్తలు, పట్టణాభివృద్ధి రంగ నిపుణులతో పాటు ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా నగరాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ ఫోరమ్‌లో పట్టణాభివృద్ధి, స్థానిక సంస్థల పరిపాలనను బలోపేతం చేయడం, భవిష్యత్ నగరాల రూపకల్పన, ఆధునిక పాలనా విధానాలు వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి.
వివిధ నగరాల్లో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా అనుభవాలు, ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకునేందుకు ఈ అంతర్జాతీయ వేదిక దోహదపడింది.
ఈ కార్యక్రమానికి విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాల స్వామి హాజరుకావడం ద్వారా విజయనగరం నగరానికి అంతర్జాతీయ వేదికపై ప్రాతినిధ్యం లభించింది.
ఈ సదస్సులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడనవీస్, ఇతర రాష్ట్రాల మంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మినేని పట్టాభిరామ్, ఐ ఎ ఎస్ అధికారులు, ఇతరులు పాల్గొన్నారు.