కానిస్టేబుళ్లదే కీలక పాత్ర.. ప్రజలతో మర్యాదగా మెలగాలి
విజయవాడ క్రైం, మేజర్ న్యూస్ : శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణలో కానిస్టేబుళ్లదే కీలక పాత్ర అని ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు అన్నారు. తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకుని ఎన్.టి.ఆర్. పోలీస్ కమిషనరేట్‌కు వచ్చిన 227 మంది నూతన కానిస్టేబుళ్లతో పోలీస్ కమాండ్ కంట్రోల్‌లో ఆయన సమావేశమై దిశానిర్దేశం చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగం కేవలం ఉద్యోగం కాదని, బాధ్యతాయుతమైన ప్రజాసేవ అని పేర్కొన్నారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత పాటించాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులు, మహిళలు, వృద్ధులతో మర్యాదగా, సానుభూతితో వ్యవహరించి వారి సమస్యలను ఓర్పుగా వినాలని సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకుని సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ఆరోగ్య పరిరక్షణకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని తెలిపారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన నూతన కానిస్టేబుళ్లను, వారి కుటుంబ సభ్యులను కమిషనర్ అభినందించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ షిరిన్ బేగం, అడ్మిన్ డీసీపీ కె.జి.వి.సరిత, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ.