గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి
గర్భిణీలకు సామూహిక సీమంతాలు, ఆడపడుచులకు సారె పెట్టిన చిన్నబాబు...
ఆలమూరు మేజర్ న్యూస్ ;పండంటి బిడ్డలకు జన్మనివ్వబోతున్న ఆడపడుచులను సొంత కుటుంబ సభ్యులుగా భావించి వారికి ఆత్మీయతను పంచుతూ సామూహిక సీమంత కార్యక్రమాన్ని నిర్వహించారు .టీడీపీ సీనియర్ నాయకులు, వెంకటేశ్వర సంస్థల అధినేత ఈదర చిన్నబాబు ప్రధాని మోదీ జన్మదినోత్సవ మహోత్సవాలు, సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా కొత్తపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ ఏ.గజలక్ష్మి సూచనల మేరకు, ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగ సత్యవేణి ఆధ్వర్యంలో పెనికేరు గ్రామంలో అంగన్వాడీల అభినందన ఉత్సవం, గర్భిణుల సీమంతోత్సవాన్ని ఈదర చిన్నబాబు సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
పెనికేరు గ్రామంలోని ఐదు అంగన్వాడీ కేంద్రాలకు చెందిన 18 మంది గర్భిణులకు ఈ సందర్భంగా సీమంతాలు నిర్వహించారు. గర్భిణులను ఆడపడుచులుగా భావించి చిన్నబాబు సమకూర్చిన చీర, గాజులు, పసుపు, కుంకుమ, పూలతో సత్కరించి ఆత్మీయంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంతో గర్భిణుల కుటుంబాల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఈదర చిన్నబాబు మాట్లాడుతూ గర్భిణులు ఆరోగ్యకరమైన, పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. తల్లి ఆరోగ్యమే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి పునాది అని, గర్భవతిగా ఉన్న సమయంలో పౌష్టికాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. మాతా శిశు సంరక్షణపై తల్లులకు పలు సూచనలు చేశారు.
గర్భవతి దశ నుంచి ప్రసవం వరకు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలు, టీకాలు, ఇతర సదుపాయాలను ప్రతి గర్భిణీ స్త్రీ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. ప్రసవం అనంతరం పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించి, అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం చేయించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆడపడుచులు ఎలాంటి అవసరం వచ్చినా తనను సొంత సోదరుడిలా భావించాలని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఈ సందర్భంగా చిన్నబాబు భరోసా ఇచ్చారు.
అనంతరం అంగన్వాడీ కార్యకర్తల సేవలను గుర్తిస్తూ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతల సంక్షేమంలో అంగన్వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలను పలువురు కొనియాడారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.