విశాఖ, విజయవాడ తరహాలో శ్రీకాకుళం కార్పొరేషన్‌ను అభివృద్ధి చేస్తాం
- అభివృద్ధికి మేము సిద్ధం.. గెలిపించడానికి మీరు సిద్ధమా?
– కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం, నవంబరు 23, మేజర్ న్యూస్: శ్రీకాకుళం నగరాన్ని విశాఖపట్నం, విజయవాడ తరహాలో అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మూడవ రోజు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి నగరంలో విస్తృతంగా పర్యటించారు. మేయర్ అభ్యర్థి దానేటి రాధారాణితో పాటు కూటమి కార్పొరేటర్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
నగరంలోని 21వ డివిజన్ మొండేటి వీధి, 24వ డివిజన్ దమ్మల వీధి, 18వ డివిజన్ మండల వీధి, 19వ డివిజన్ మహాలక్ష్మి నగర్ కాలనీ, 20వ డివిజన్ చంపాగల్ల వీధి, 39వ డివిజన్ కోటి వీధి, 38వ డివిజన్ సెవెన్ రోడ్ జంక్షన్, 46వ డివిజన్ పుణ్యపు వీధి, 47వ డివిజన్ రైతుబజార్, 48వ డివిజన్ పరాంకుశ నగర్ కాలనీ, 49వ డివిజన్ సానవీధి, 44వ డివిజన్ డీసీసీబీ కాలనీ ప్రాంతాల్లో మంత్రి ప్రచారం నిర్వహించారు. ప్రతి ప్రాంతంలోనూ ప్రజలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రజలు చూపించిన ఆదరణ, ఉత్సాహం కూటమిపై వారికున్న నమ్మకానికి నిదర్శనంగా నిలిచాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే పెద్దపాడు, పాలకొండ రోడ్ల అభివృద్ధి వంటి పనులతో శ్రీకాకుళం నగరంలో మౌలిక వసతుల విస్తరణకు శ్రీకారం చుట్టామన్నారు. కార్గిల్ పార్కును అభివృద్ధి చేసినప్పుడు ప్రజల నుంచి వచ్చిన ఆదరణ, స్పందన చూసి ఎంతో ఆశ్చర్యం కలిగిందని తెలిపారు. ఇదే తరహాలో నగరంలోని ప్రతి వార్డులో పార్కులను అభివృద్ధి చేస్తామని, మౌలిక వసతులను విస్తృతపరిచి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి విషయంలో ప్రజలు ఇప్పటికే అందిస్తున్న సహకారాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని కోరారు. కూటమి అభ్యర్థులంతా అభివృద్ధి టీమ్‌లో భాగమని, వారిని గెలిపిస్తే నగర అభివృద్ధికి మరింత వేగం తీసుకువస్తామని అన్నారు. మంచి చేయాలనే ఆలోచనే తమ రాజకీయాలకు పునాది తప్ప, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు.
శ్రీకాకుళం నగరాన్ని విశాఖ, విజయవాడ తరహాలో తీర్చిదిద్దేందుకు మేము సిద్ధం.. గెలిపించడానికి మీరు సిద్ధమా?అంటూ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. మేయర్ అభ్యర్థి దానేటి రాధారాణితో పాటు కూటమి కార్పొరేటర్ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించి, శ్రీకాకుళం నగర అభివృద్ధికి బలమైన పునాది వేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు శకలక శంకర్, కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.