మాచవరం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కూటమి నేతల జోరు..
సూర్య ప్రతినిధి (పి.గన్నవరం/అంబాజీపేట): అంబాజీపేట మండలంలోని మేజర్ పంచాయతీలలో ఒకటైన మాచవరం గ్రామపంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి మైపాల తాతాజీ విజయానికి నాయకులు, కార్యకర్తలంతా సమష్టిగా కృషి చేయాలని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ మోకా ఆనందసాగర్ పిలుపునిచ్చారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం పూర్తి కావడంతో ఎన్నికల అధికారులు తాతాజీకి కేటాయించిన 'మంచం' గుర్తుతో ముద్రించిన కరపత్రాలు (పాంప్లెట్లు), నమూనా బ్యాలెట్ పేపర్లను మాచవరం యువ గణపతి ఆలయం సమీపంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆవిష్కరించారు.
ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు అభ్యర్థన:
అనంతరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి మైపాల తాతాజీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. మరోవైపు, మాచవరం గ్రామ దేవతలైన శ్రీ ఇటికాలమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయ సమీపంలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ మోకా ఆనందసాగర్ విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కీలకమైన మాచవరం పంచాయతీ అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థి గెలుపు ఎంతో అవసరమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.