ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి హోంమంత్రి అనిత అండ
విద్యార్థి చదువుకు ఆటంకం కలగకుండా టీసీ, సర్టిఫికెట్లు ఇవ్వాలని పాఠశాల యాజమాన్యానికి ఆదేశం
నక్కపల్లి, మేజర్ న్యూస్ ;నవంబరు 24: భర్తను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కర్రీ దేవి కుటుంబానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అండగా నిలిచారు. తన పిల్లల చదువుకు సంబంధించిన సమస్యను మంగళవారం నక్కపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆమె దృష్టికి తీసుకెళ్లగా, మంత్రి వెంటనే స్పందించారు.
రమణయ్యపేట గ్రామానికి చెందిన కర్రీ దేవి కుమారుడు తేజసాయి తునిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి పూర్తి చేశాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఫీజు బకాయిలు చెల్లించలేకపోవడంతో పాఠశాల యాజమాన్యం టీసీ ఇచ్చేందుకు నిరాకరించిందని దేవి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై స్పందించిన హోంమంత్రి అనిత వెంటనే సదరు పాఠశాల యాజమాన్యంతో ఫోన్‌లో మాట్లాడారు. విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని టీసీతో పాటు అవసరమైన ధ్రువపత్రాలను తక్షణమే అందజేయాలని ఆదేశించారు. పిల్లల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తానని, అధైర్యపడవద్దని కర్రీ దేవికి భరోసా ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు