కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి.
డిసెంబర్ 1 చలో ఢిల్లీని జయప్రదం చేయండి.
- సీఐటీయూ.
అనకాపల్లి, నవంబర్ 24, మేజర్ న్యూస్: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, డిసెంబర్ 1న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అనకాపల్లి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం చలో ఢిల్లీ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్‌లను తెచ్చిందని, వీటి వల్ల కార్మికులకు భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు. సంవత్సరాల తరబడి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులు అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా నేటికీ అమలు చేయలేదని అన్నారు. కేంద్ర కార్మిక సంఘాల సభ కనీస వేతనం రూ.42,000 నిర్ణయించాలని తీర్మానం చేసిందని, దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, పెట్టుబడిదారులకు ప్రభుత్వం ఎకరా భూమిని రూపాయికే ఇస్తుందని, కిలో బియ్యం మాత్రం రూ.100 దాటిందని, కార్మికుల జీవన పరిస్థితులు దుర్భరంగా మారాయని అన్నారు. మున్సిపల్ రంగంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయాలని, అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస పెన్షన్ రూ.21,000 ఇవ్వాలని, ప్రజల సంపద భూమి, అడవి, నీటిని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో ఢిల్లీలో జరిగే ధర్నాలో అనకాపల్లి కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పోలా రావు, శేఖర్, శ్రీను, రాము, వాసు తదితరులు పాల్గొన్నారు.