విద్యార్థులే దేశ భవిష్యత్తు వారి సంతోషమే సమాజానికి స్ఫూర్తి కరస్పాండెంట్ కుర్ర అవర్ణ
రేపల్లె మేజర్ న్యూస్; బాలలే దేశ భవిష్యత్తుకు పునాదులని, చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉందని రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ కుర్ర అవర్ణ సూచించారు శనివారం పట్టణంలోని రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ అవర్ణ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సేవాభావం అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని పట్టుదలతో ముందుకు సాగాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
బాలలంటే అమితమైన ప్రేమను చూపిన భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో ప్రత్యేకమని ఆమె తెలిపారు. పిల్లల పట్ల నెహ్రూకు ఉన్న ప్రేమ, ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.
అనంతరం పాఠశాల డైరెక్టర్ డాక్టర్ మహేష్ మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి విద్యతో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు పాఠశాల ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అనంతరం చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.