ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
జఫర్ ఘడ్, మేజర్ న్యూస్, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని షా పల్లి, హిమ్మత్ నగర్ గ్రామాలలో సర్పంచులు తాళ్లపల్లి సుభాష్ చంద్రబోస్, కడుతూరి మమతా సోమయ్య ఆధ్వర్యంలో, జఫర్గడ్ లో ఉప సర్పంచ్ ఫుట్బాల్ కుమార్ ఆధ్వర్యంలో బాలల గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల హక్కులు, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత, భద్రత వంటి అంశాలపై చిన్నారులకు ప్రత్యేక అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడమే బాలల గ్రామసభ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని, బాల కార్మిక వ్యవస్థ, బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలలకు అందుతున్న సౌకర్యాలు, ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బాలలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించేలా ప్రోత్సహించాలని, వారి హక్కులను పరిరక్షించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్; సురేష్, జాఫర్గడ్, జనగామ జిల్లా