BREAKING
గవర్నర్‌ను కలిసిన వైసీపీ బృందం.. ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదు రామకృష్ణ పై పీ డి యాక్ట్ నమోదు ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీ..... రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికైన న్యూ రిషి పాఠశాల విద్యార్థులు నేడు యుసుప్ పూర్ గ్రామంలో పోలియో చుక్కల కార్యక్రమం ప్రజాస్వామ్య పరిరక్షణకు కదం తొక్కనున్న మహా పాదయాత్ర క్షిపణి దాడుల కంటే ఆర్థిక యుద్ధమే కఠినం.. బాలల రక్షణకు ఉపాధ్యాయులే కీలక రక్షకులు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో “లైఫ్ మేనేజ్‌మెంట్”పై అవగాహన కార్యక్రమం ఏ.ఎస్.డీ.డీ ఓటర్లకు మరో అవకాశం కల్పించి అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చాలి. సీపీఐ బలోపేతానికి క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలి - సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి - చాడ వెంకటరెడ్డి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా - జిల్లా కలెక్టర్ కె.హరిత వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్ -స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం ముదిగుబ్బ సర్పంచ్ బరిలో ఏడుగురు అభ్యర్థులు జలసిరి పనులపై అవగాహన

వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్ -స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం

Select Suryaa Now
వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్  -స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం

అమరావతి, మేజర్‌న్యూస్‌ :

 ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారని, 2024 సార్వత్రిక ఎన్నికల కంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి మరింత ఆదరణ లభించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా ప్రజలు కూటమి అభ్యర్థులను అక్కున చేర్చుకున్నారని, ఈ విజయం రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన ప్రతిఫలంగా భావిస్తున్నామని చెప్పారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు మరింత బాధ్యతతో పనిచేస్తామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా, పోస్టల్ బ్యాలెట్ అయినా ప్రజల తీర్పు కూటమికి అనుకూలంగానే ఉందన్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూటమి 96.42 శాతం స్ట్రయిక్ రేట్ సాధించిందని, ఎంపీపీల్లో 93.15 శాతం స్థానాలను గెలుచుకుందని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ 94 శాతం స్ట్రయిక్ రేట్ నమోదు చేసినట్లు తెలిపారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి 39.81 శాతం ఓట్లు రాగా, ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో అది 33.56 శాతానికి పడిపోయిందని, ఆ పార్టీకి 6.25 శాతం ఓట్లు తగ్గాయని వివరించారు. రాష్ట్రంలో కూటమి మరింత బలపడిందని, వైసీపీ పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గిందని ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని అన్నారు. కూటమి సాధించిన విజయంతో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిందని సీఎం వ్యాఖ్యానించారు.

చెప్పాం... చేశాం... చేస్తాం

కూటమి ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమం, చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సుపరిపాలనను ప్రజలు గుర్తించారని ముఖ్యమంత్రి అన్నారు. చెప్పినవి చేస్తున్నాం.. చేయాల్సినవి చేస్తామని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన విషయంలో ఎక్కడా రాజీ పడబోమన్నారు. ఆరోగ్యకరమైన, సంపన్నమైన, సంతోషకరమైన సమాజం నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను విశాఖపట్నానికి, కృష్ణా డెల్టాకు తరలించే దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. గత పాలకులు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో ప్రజల భూముల భద్రతను ప్రశ్నార్థకం చేశారని విమర్శించారు. ఆ చట్టాన్ని రద్దు చేసి, వ్యక్తుల ఫొటోలతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాల స్థానంలో రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను అందిస్తున్నామని వివరించారు. రైతుల భూములకు భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యమన్నారు. తీవ్ర స్థాయి ఎల్‌నినో ప్రభావంతో పాటు వరుసగా రెండు తుఫాన్లు రాష్ట్రాన్ని తాకినప్పటికీ ప్రభుత్వం తక్షణమే స్పందించిందని చంద్రబాబు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి సాధారణ పరిస్థితులు పునరుద్ధరించేందుకు కృషి చేశామని, విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించామని చెప్పారు. పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం రూ.1.30 లక్షల కోట్లకు పైగా అప్పులతో విద్యుత్ సంస్థలను నష్టాల్లోకి నెట్టిందని విమర్శించారు. అలాగే నాటి పాలకులు ప్రజలపై రూ.32 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా.. విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు.

ప్రజల అజెండానే... ప్రభుత్వ అజెండా

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం, అన్ని వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించడం, అభివృద్ధి ఫలాలను ప్రతి కుటుంబానికి చేరవేయడం ద్వారా ప్రజల నమ్మకాన్ని మరింత పెంచుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో లభించిన ఘన విజయం కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి ప్రతీక అని, ఈ విజయాన్ని మరింత బాధ్యతగా భావించి పాలనను కొనసాగిస్తామని తెలిపారు. రాజకీయాల్లో ధన ప్రభావం తగ్గి, సేవాభావం ఉన్న నాయకత్వం ఎదగాలన్నదే తమ అభిమతమని చంద్రబాబు పేర్కొన్నారు. ఇటీవల ఒక ఓటరు అభ్యర్థి ఇచ్చిన డబ్బును తన ఓటుతో సహా బ్యాలెట్ బాక్సులో వేసి తిరస్కరించడం ప్రజల్లో వస్తున్న చైతన్యానికి నిదర్శనమన్నారు. ఓటు విలువను గుర్తించి, డబ్బుకు లొంగకుండా ప్రజలు నిర్ణయం తీసుకునే పరిస్థితి రావడం ప్రజాస్వామ్యానికి శుభపరిణామమని చెప్పారు. రాజకీయాల్లో డబ్బు కంటే ప్రజలకు చేసిన సేవ, నాయకుడి పనితీరు, విశ్వసనీయతే కీలకం కావాలన్నారు. తాము చేసిన అభ్యర్థుల కసరత్తులోనూ ఇవే అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. స్థానిక సంస్థల పదవుల ఎంపికలో కులం, వర్గం, ప్రాంతం, మహిళా ప్రాతినిధ్యంతో పాటు అభ్యర్థుల విద్యార్హతలు, వయసు, అంకితభావం, పార్టీకి చేసిన సేవలను పరిగణనలోకి తీసుకున్నామని ముఖ్యమంత్రి వివరించారు. జనాభా దామాషా ప్రకారం బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, బలహీన వర్గాలకు తగిన ప్రాధాన్యం కల్పించామన్నారు. రాజ్యాధికారంలో తమకూ భాగస్వామ్యం దక్కిందన్న సంతృప్తి అన్ని వర్గాల్లో కలగాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. చట్టసభల్లోనే కాకుండా స్థానిక సంస్థల్లోనూ ఆయా వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. కర్నూలు జెడ్పీ వైస్ ఛైర్ పర్సన్‌గా 25 ఏళ్ల వయసులోనే ఎంబీబీఎస్ పూర్తి చేసిన షేక్ షాదికను ఎంపిక చేశామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం జెడ్పీటీసీ జనరల్ మహిళ స్థానానికి ఎస్సీ యువతి, ఎంటెక్ చదివిన కోట పుల్లమ్మకు అవకాశం కల్పించామని వివరించారు. 22 జెడ్పీ ఛైర్ పర్సన్ స్థానాలకు గాను 12 స్థానాలను మహిళలకు కేటాయించామని, వీరిలో 14 మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారని తెలిపారు. 20 జెడ్పీ వైస్ ఛైర్ పర్సన్ స్థానాలకు గాను 11 స్థానాలను మహిళలకు ఇచ్చామని, వారిలో 17 మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారని వివరించారు. విద్యావంతులైన యువతకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం ద్వారా స్థానిక సంస్థల్లో సమర్థవంతమైన పాలనకు బాటలు వేస్తున్నామని చెప్పారు.

పని చేసేవారికే పట్టం

పార్టీ కోసం కష్టపడే సామాన్య కార్యకర్తలకు ఉన్నతమైన రాజకీయ అవకాశాలు కల్పించడమే తమ విధానమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎంపీటీసీ స్థాయి నుంచి ఎంపీ స్థాయికి ఎదిగే అవకాశం కల్పించామని, ఇప్పుడు సామాన్య కార్యకర్తలను జిల్లా పరిషత్ ఛైర్మన్లుగా నియమించి రాజ్యాధికారంలో భాగస్వాములను చేశామని తెలిపారు. కార్యకర్తే అధినేత అనే సిద్ధాంతాన్ని ఆచరణలో చూపించామని, కార్యకర్త లేకపోతే పార్టీ లేదన్న విషయాన్ని గుర్తుంచుకుని పదవుల ఎంపికలో పార్టీకి సేవ చేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చామని టీడీపీ అధినేత చెప్పారు. పదవులు కొందరికే పరిమితం కాకుండా కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, అవకాశం లభించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్లు, వైస్ ఛైర్ పర్సన్ల ఎంపికలో మహిళలకు పెద్దపీట వేశామని వెల్లడించారు. పల్నాడు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌గా యాదవ సామాజిక వర్గానికి చెందిన సామాన్య కార్యకర్త పుచ్చకాయల రమాదేవిని ఎంపిక చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. తూర్పుగోదావరి జెడ్పీ ఛైర్ పర్సన్‌గా శెట్టిబలిజ వర్గానికి చెందిన కాడ పద్మకు అవకాశం కల్పించామన్నారు. కడప జెడ్పీ వైస్ ఛైర్ పర్సన్‌గా ముస్లిం మహిళ హబీబున్నీసాను, ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పార్టీ యూనిట్ ఇన్‌ఛార్జి కొక్కిలిగడ్డ ప్రభాకర్ రావును, నంద్యాల జెడ్పీ ఛైర్మన్‌గా క్లస్టర్ ఇన్‌ఛార్జి షేక్ బురహానుద్దీన్‌ను ఎంపిక చేశామని తెలిపారు. పశ్చిమ గోదావరి జెడ్పీ వైస్ ఛైర్మన్‌గా బూత్ కన్వీనర్‌గా పనిచేస్తున్న నాగేశ్వరరావుకు, అన్నమయ్య జెడ్పీ వైస్ ఛైర్ పర్సన్‌గా బోయ సామాజిక వర్గానికి చెందిన తలారి శరణ్యకు అవకాశం కల్పించామని చెప్పారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన వారికి, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఉన్నత పదవులు కట్టబెట్టడం ద్వారా రాజకీయాల్లో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.

కూటమికే ప్రజాశీర్వాదం

స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థులను అన్ని చోట్లా గెలిపించిన విధానం చూస్తుంటే.... కూటమికి మరింతగా ప్రజాదరణ పెరిగిందని అర్థమవుతోందని ముఖ్యమంత్రి అన్నారు. సీట్ల సర్దుబాటు మొదలుకుని అభ్యర్థుల ఎంపిక వరకు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. అలాగే మిత్రపక్షాలతో సర్దుబాట్లు, సమన్వయం కోసం ప్రత్యేకంగా కృషి చేశామని వెల్లడించారు. అందరూ ఐకమత్యంతో పనిచేయడం వల్లే కూటమికి ఈ స్థాయి విజయం సాధ్యమైందన్నారు. కొన్ని చోట్ల వచ్చిన ఫలితాలపై కూడా అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. అల్లూరి సీతారామరాజు లాంటి జిల్లాల్లో వచ్చిన ఫలితాలను విశ్లేషించుకుంటున్నాం. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తాము చేయని ప్రయత్నం లేదన్నారు. బలవంతపు మత మార్పిళ్ల ద్వారా కొందరు ఆ ప్రాంత ప్రజలను ప్రలోభ పెడుతున్నారని విమర్శించారు. ప్రజాప్రతినిధుల పనితీరును కూడా అంచనా వేస్తున్నామని... స్థానిక నాయకత్వంతో సమస్యలు ఉంటే సరిదిద్దుకుంటామని తెలిపారు. కొందరు ఎమ్మెల్యేల పనితీరును ప్రజలు మెచ్చలేదు... అలాంటి వారు తమను తాము సరిదిద్దుకోవాల్సి ఉందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. కూటమి ధర్మాన్ని పాటించకుండా కొందరు నేతలు అలగటం సరికాదన్నారు. టీడీపీలోనూ ముగ్గురు నేతలు అలిగారని.. తాను ఇంత కష్టపడి కసరత్తు చేస్తుంటే అలగడమేంటంటూ సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలిగిన నేతల విషయంలో తాను హ్యాపీగా లేనన్నారు.

గొడ్డలి పార్టీ విధ్వంసాలను ప్రజలు తిరస్కరించారు

స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే రాష్ట్రంలోని ఓ పార్టీ వివిధ విన్యాసాలు చేసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కుట్రలు, కుతంత్రాలతో 63 పిటిషన్లు వేసి స్థానిక ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నం చేసిందని గొడ్డలి పార్టీపై విమర్శలు చేశారు. బీసీ రిజర్వేషన్లను, సర్ పేరిట, డీలిమిటేషన్ పేరిట ఎన్నికల్ని ఆపాలని వైసీపీ కుట్ర చేసిందన్నారు. హింసకు పాల్పడింది వైసీపీనే... ఫిర్యాదు చేసింది వైసీపీనేనని... అయితే ఈ డ్రామాలను ప్రజలు విశ్వసించలేదన్నారు. అందుకే గొడ్డలి పార్టీ ఆటలు సాగలేదన్నారు. వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ప్రజలకు హ్యాట్సాఫ్ అంటూ ప్రజలను అభినందించారు. అంతిమంగా స్థానిక ఎన్నికల్లోనూ వైసీపీకి ప్రజల మద్దతు దక్కలేదన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రాభివృద్ధి ఆగదని సీఎం వెల్లడించారు. 10 ఏళ్లలో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రం అవువుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రం నిలదొక్కుకుని నడుస్తోంది... అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టించే శక్తిని ప్రజలే ఇస్తారనే విశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అభిమానం, మద్దతుతో ఐక్యంగా పనిచేసి ఎన్నికల్లో విజయం సాధించామని... స్థానిక సంస్థల్లో ప్రజాతీర్పును వినయంతో స్వీకరిస్తున్నామని... తమ బాధ్యత కూడా పెరిగిందని ముఖ్యమంత్రి చెప్పారు.
*****