ఏ.ఎస్.డీ.డీ ఓటర్లకు మరో అవకాశం కల్పించి అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చాలి.
సంగారెడ్డి, ప్రతినిధి:-- ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఏ.ఎస్.డీ.డీ జాబితాలో ఉన్న ఓటర్లకు మరో అవకాశం కల్పించి, అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు.శనివారం హైదరాబాద్ నుంచి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించి, పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఏ.ఎస్.డీ.డీ ఓటర్ల గుర్తింపు, ధ్రువీకరణ ప్రక్రియలో బూత్ లెవల్ ఏజెంట్లు, బీఎల్ఓ సూపర్వైజర్ల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. చిరునామా, ఆధార పత్రాలు లేని నిరాశ్రయుల విషయంలో బీఎల్ఓలు నిర్వహించే క్షేత్రస్థాయి పరిశీలన నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. ఇప్పటికే ఫారం-6 సమర్పించిన ఓటర్లు మళ్లీ ఎన్యూమరేషన్ ఫారం సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.అందిన దరఖాస్తుల్లోని అర్హతలు, ఇతర వివరాలను సంబంధిత ఈఆర్ఓలు పరిశీలించి పరిష్కరించాలని, అర్హత నిర్ధారణ అనంతరం ఆమోదించిన ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అటువంటి ఓటర్లకు గతంలో కేటాయించిన ఎపిక్ నంబర్‌ను తిరిగి కేటాయించాలని తెలిపారు. సంబంధిత ఓటర్లు తమ బీఎల్ఓలను సంప్రదించి అవసరమైన ఫారాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, జిల్లాలో అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగించ
బడకూడదనే లక్ష్యంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏ.ఎస్.డీ.డీ జాబితాలో ఉన్న ఓటర్లకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా సంబంధిత ఓటర్లకు తాజాగా ఎన్యూమరేషన్ ఫారంతో పాటు అనెక్సర్-బి, అనెక్సర్-సి ఫారాలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.జిల్లాలో 2,98,278 ఏ.ఎస్.డీ.డీ ఓటర్లను గుర్తించినట్లు తెలిపారు. ఈ జాబితాలో ఉన్న వారిలో అర్హులైన ఓటర్ల పేర్లు పొరపాటున తొలగించబడితే, వారికి మరో అవకాశం కల్పించి ఓటరు జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏ.ఎస్.డీ.డీ జాబితాలో ఉన్న సంబంధిత ఓటర్లకు వ్యక్తిగతంగా, ఎస్‌ఎంఎస్, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు.జిల్లాలో ఫారం-6, ఫారం-6ఏ, ఫారం-7, ఫారం-8లకు సంబంధించి మొత్తం 11,503 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ పాండు, ఈఆర్ఓలు, ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.