telangana
సీపీఐ బలోపేతానికి క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలి - సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి - చాడ వెంకటరెడ్డి
సూర్య కరీంనగర్ : గ్రామస్థాయి నుంచి సీపీఐని మరింత బలోపేతం చేసేందుకు 2027 సంవత్సర సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి, క్షేత్రస్థాయిలో నాయకత్వం చురుకుగా పనిచేయాలని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం బోయిని అశోక్ అధ్యక్షతన నిర్వహించగా, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలంటే పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాలని, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ పేదల సమస్యలను పట్టించుకోవడం లేదని, నిరుద్యోగం, ఆకలి, దారిద్య్రం పెరుగుతున్నాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో వివక్ష చూపుతూ విభజన హామీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ, రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా కేంద్రం కరువు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని, అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు అందించి ఆదుకోవాలని కోరారు. సమావేశంలో పంజాల శ్రీనివాస్, పొనగంటి కేదారి, అందె స్వామి, కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, న్యాలపట్ల రాజు తదితరులు పాల్గొన్నారు.