telangana
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా - జిల్లా కలెక్టర్ కె.హరిత
సూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హత గల ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత, ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శాసనమండలి సభ్యులు దండే విఠల్, ఆసిఫాబాద్ శాసనసభ్యులు కోవ లక్ష్మీ, జిల్లా అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మున్సిపల్ చైర్ పర్సన్లు మెంగ్రే ఆకాష్, సహిన్ సుల్తానా, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్ల మంగ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కామ్డే అనిల్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు అలీబిన్ అహ్మద్, అసిఫాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి.అహ్మద్ లతో కలిసి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి వర్తించే విధంగా 5 లక్షల రూపాయల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈనెల 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించిందని తెలిపారు. జిల్లాలో 1 లక్ష 65 వేల రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలకు మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామపంచాయతీలలోని 411 ప్రదేశాలలో శిబిరాలు నిర్వహించి, ప్రతి ఒక్కరి నుండి భీమా దరఖాస్తులు స్వీకరించి వివరాలను నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. రేషన్ కార్డులు లేని వారికి త్వరలో రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామని, ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా, ఎలాంటి దృవపత్రాలు అవసరం లేకుండా కేవలం రేషన్ కార్డు నెంబరు ఉంటే కుటుంబ సభ్యుల సమ్మతితో కుటుంబంలో గల 18 నుండి 59 సంవత్సరాల వయసు గల వారిలో ఒకరికి బీమా చేయించుకుని, నామిని వివరాలను దరఖాస్తులో నింపితే సరిపోతుందని తెలిపారు. జిల్లాలో ఈ పథకంపై ప్రజలందరికీ తెలిసే విధంగా టామ్ టామ్, గోడ ప్రతులు, కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.శాసనమండలి సభ్యులు మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నినదించిన గరీబీ హటావో కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి వర్తించేలా సామాజిక భద్రత, ఆర్థిక భరోసా అందించాలనే ఆలోచనతో ఈ పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. ప్రభుత్వం ప్రారంభించే ప్రతి పథకంలో మహిళలకు పెద్దపీట వేస్తుందని, జిల్లా ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఆసిఫాబాద్ శాసనసభ్యులు మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రతి అర్హత కుటుంబానికి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. దరఖాస్తులు స్వీకరించే శిబిరాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సదుపాయాలు కల్పించి, పారదర్శకంగా ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకాలు 100 శాతం అర్హులైన లబ్ధిదారులకు అందిన అధికారులకు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కౌన్సిలర్లు, సర్పంచ్ లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.