బాలల రక్షణకు ఉపాధ్యాయులే కీలక రక్షకులు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్
గుంటూరు : జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలు, గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు, 'సురక్షిత బాల్యం - బాలల రక్షణ ఉద్యమం' 14 రోజుల పాన్-ఇండియా అవగాహన కార్యక్రమంలో భాగంగా శనివారం గుర్తించబడిన ఉపాధ్యాయులకు పోక్సో చట్టం–2012పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ ప్రతి బిడ్డ భయం లేని, సురక్షితమైన బాల్యాన్ని పొందేలా చూడటమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. పిల్లల జీవితంలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులే మొదటి నమ్మకమైన వ్యక్తులని, విద్యార్థుల ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనించి వేధింపుల సంకేతాలను సున్నితంగా గుర్తించాలని సూచించారు. విద్యార్థులకు వయసుకు తగిన రీతిలో 'గుడ్ టచ్ - బ్యాడ్ టచ్', వ్యక్తిగత హద్దులతో పాటు, ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ గ్రూమింగ్, ఆన్‌లైన్ వేధింపుల పట్ల అప్రమత్తత కలిగించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి షమీ పర్వీన్ సుల్తానా బేగం మాట్లాడుతూ, అన్ని చట్టాల కంటే చిన్నదైనప్పటికీ పోక్సో చట్టం అత్యంత శక్తివంతమైనదని తెలిపారు. 18 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలపై జరిగే ఏ విధమైన లైంగిక నేరాలకైనా ఈ చట్టం వర్తిస్తుందని, బాధితుల వయస్సు ఇక్కడ ప్రధాన ప్రామాణికమని స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా 2019లో ఈ చట్టానికి కఠినమైన సవరణలు చేశారని, ఈ కేసుల సత్వర పరిష్కారం కోసమే ప్రత్యేక పోక్సో కోర్టులు పనిచేస్తున్నాయని వివరించారు. సివిల్ జడ్జి సి. రమణ రెడ్డి మాట్లాడుతూ, పోక్సో చట్టం ప్రకారం నేరాలపై తప్పనిసరిగా ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చిన్నారి బాధితులతో వ్యవహరించేటప్పుడు బాలల స్నేహపూర్వక విధానాలు పాటించాలని సూచించారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరిస్తూ, "సురక్షిత బాల్యం - మన సమిష్టి బాధ్యత" అనే సందేశాన్ని తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల ఉపాధ్యాయులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
సూర్య నాయక్