షర్మిల పెళ్లి ఆహ్వానంపై 'సాక్షి' కథనాలపై సీఎం చంద్రబాబు స్పందన
అమరావతి: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందించేందుకు రావడంపై 'సాక్షి' పత్రికలో ప్రచురితమైన కథనాల పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక శుభకార్య ఆహ్వానాన్ని కూడా రాజకీయ కోణంలో చూడటం సరికాదని ఆయన పేర్కొన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వయంగా ఆహ్వానించగా తాను షర్మిల వివాహానికి హాజరయ్యానని, అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెళ్లికి కూడా పులివెందుల వెళ్లిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. తమ మధ్య ఉన్నది కేవలం రాజకీయ పోరాటమే తప్ప వ్యక్తిగత ద్వేషాలు కాదని ఆయన స్పష్టం చేశారు. రక్తం పంచుకుపుట్టిన సొంత చెల్లెలి విషయంలోనూ ఇటువంటి బాధ్యతారాహిత్యమైన కథనాలు రాయడం తగదని చంద్రబాబు హితవు పలికారు.