క్షిపణి దాడుల కంటే ఆర్థిక యుద్ధమే కఠినం..
టెహ్రాన్: ఇరాన్ ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తెలిపారు. ప్రత్యక్షంగా జరిగే క్షిపణి దాడుల కంటే ప్రస్తుత పరిస్థితి ఒక 'నిశ్శబ్ద ఆర్థిక యుద్ధం' లాంటిదని, ఇది దేశానికి మరింత కఠినమైన సవాలుగా మారిందని ఆయన అభివర్ణించారు. గ్యాస్ ఉత్పత్తిపై దాడులు, తీవ్రమైన ఇంధన కొరత వల్ల దేశం ఇబ్బందులు పడుతోందని పేర్కొన్నారు. పారిశ్రామిక రంగానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే విద్యుత్ కోతలు విధిస్తామని ఆయన వెల్లడించారు. అదేవిధంగా, నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ తీరుపై కూడా పెజెష్కియాన్ విమర్శలు గుప్పించారు. మరోవైపు, అమెరికా తన ఆర్థిక ఒత్తిడిని కొనసాగిస్తూ ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకుంటోంది.