*ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి
విజయనగరం, సూర్య : జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల ఎంపీడీఓ కార్యాలయాల్లో ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల మాదిరిగానే ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఉద్యోగులకు కేటాయించిన పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఫెసిలిటేషన్ సెంటర్లలో అన్ని రకాల మౌలిక వసతులు, ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఫెసిలిటేషన్ సెంటర్‌కు వచ్చే ఉద్యోగులు తమ గుర్తింపు కార్డు, ఓటర్ ఐడీ కార్డు, మరియు ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్ కాపీ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఉద్యోగుల పత్రాల ధృవీకరణను వేగవంతం చేసేందుకు సెంటర్లలోనే గెజిటెడ్ అధికారులను అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. జెడ్‌పిటిసి మరియు ఎంపిటిసి అభ్యర్థుల ఎంపిక కోసం ఉద్యోగులు రెండు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వేయాల్సి ఉంటుందన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు సెంటర్ సమీపంలో ఉండి ప్రక్రియను పరిశీలించేందుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఓటింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను కఠిన భద్రతా ప్రమాణాలతో సీల్ చేసి, స్ట్రాంగ్ రూములకు తరలించి భద్రపరుస్తామని తెలిపారు.