andhrapradesh
త్యాగాలు చేసిన వారిని దూరం చేసుకోవద్దు
కాకినాడ, నవంబర్ 21: కాకినాడ నగరపాలక సంస్థ (మున్సిపల్ కార్పొరేషన్) ఎన్నికల సన్నద్ధతలో భాగంగా శనివారం కాకినాడలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లతో పాటు కూటమి పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. గతంలో పదవులు అనుభవించిన కొందరు నేతలు ఇష్టానుసారంగా దుర్భాషలాడారని, సమాజంలో అలజడి సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూశారని మండిపడ్డారు. అలాంటి కుట్రలను కూటమి శ్రేణులు సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బరిలోకి దిగే కార్పొరేటర్ అభ్యర్థులు పూర్తి అవగాహనతో, సమన్వయంతో పనిచేయాలని నాదెండ్ల సూచించారు. ముఖ్యంగా కూటమి విజయం కోసం కష్టపడిన, సీట్ల సర్దుబాటులో త్యాగాలు చేసిన నాయకులు, కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోవద్దని, వారందరినీ కలుపుకుని ముందుకు సాగుతూ సముచిత గౌరవం కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.