ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంః మంత్రి సీతక్క
సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధిః రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, సామాన్యులు, మహిళలు, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రజా ప్రభుత్వమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ మంజూరు చేస్తామని, ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులు సైతం దరఖాస్తు చేసుకోవాలని, అర్హతలు పరిశీలించి వారికి కూడా పెన్షన్ అందిస్తామని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం గ్రామంలోని కాకి ఈశ్వర ముదిరాజ్ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన చేయూత నూతన పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మహేశ్వరం కాంగ్రెస్ ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు పారిజాత రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి, డీఆర్డీఓ శ్రీలత, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క పలువురు లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు పెన్షన్లు అందుతున్నాయని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఎంతోకాలంగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత అందిస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. ప్రస్తుతం మంజూరు చేస్తున్న నూతన పెన్షన్లలో 70 శాతానికి పైగా మహిళలకు దక్కుతున్నాయని చెప్పారు. వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు తదితర అర్హులందరికీ పెన్షన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ దఫాలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలకు కలిపి 4.75 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 60 వేలకు పైగా పెన్షన్లు, మహేశ్వరం నియోజకవర్గంలో 4,822 మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ మొత్తాన్ని జమ చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ఇంకా అర్హత ఉన్న వారు ఎవరైనా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సీతక్క అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో పాటు, మహిళా సంఘాల ద్వారా వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు అందిస్తున్నామని చెప్పారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ మహిళలు సొంతంగా వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆడబిడ్డ సంతోషంగా ఉంటే కుటుంబం, సమాజం సంతోషంగా ఉంటుందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులను సైతం మహిళల పేరుతో అందిస్తున్నామని తెలిపారు.
ఇప్పటికే 15 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని, ఇంకా అర్హులు ఉంటే వారికి కూడా కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారు. ప్రతి మహిళా స్వయం సహాయక సంఘంలో చేరి ఆర్థికంగా బలోపేతం కావాలని, మహిళా సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కలుగుతుందని సూచించారు.
రాజకీయాలకు ఇది వేదిక కాదు.. అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం
చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాజకీయాలకు వేదిక కాదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. పరస్పర నినాదాలు చేస్తున్న పార్టీల కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని, కోపాలు, తాపాలు, ఆవేశాలకు లోనుకాకుండా రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని కోరారు. అంతకుముందు మహేశ్వరం నియోజకవర్గంలోని మొహబ్బత్నగర్ గ్రామపంచాయతీ పరిధిలో హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. శ్రీశైలం హైవే పక్కన మొహబ్బత్నగర్ వద్ద మొత్తం 13 రోడ్ల నిర్మాణ పనులకు ఫౌండేషన్ కార్యక్రమం నిర్వహించారు. సుమారు రూ.37 కోట్ల 13 లక్షల అంచనా వ్యయంతో 43.38 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. మంత్రి సీతక్క శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మహేశ్వరం కాంగ్రెస్ ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, రంగారెడ్డి డిసిసి అధ్యక్షులు పారిజాత రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. పేదలు, సామాన్యులు, మహిళలు, రైతులు, బలహీన వర్గాలకు అండగా నిలవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఇది పేదల ప్రభుత్వం.. సామాన్యుల ప్రభుత్వం.. మహిళల ప్రభుత్వం.. రైతుల ప్రభుత్వం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే మా లక్ష్యం” అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.