తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ వేగవంతంః మంత్రి పొన్నం నివాసంలో కమిటీ సమావేశం
సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని గుర్తింపు కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యమకారుల గుర్తింపు కోసం ఏర్పాటు చేయనున్న ప్రత్యేక వెబ్‌సైట్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. మినిస్టర్ క్వార్టర్స్‌లోని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ కే. కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి, శ్యాం మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం కమిటీ ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, పనుల పురోగతిపై సభ్యులు సమీక్షించారు. వివిధ విశ్వవిద్యాలయాల్లోని ఉద్యమకారులు, కళాకారులు, సబ్బండ వర్గాలతో ఇప్పటికే జరిపిన సంప్రదింపుల వివరాలను చర్చించారు. గుర్తింపు ప్రక్రియను పూర్తిచేయడానికి ఇంకా చేపట్టాల్సిన చర్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఉద్యమకారుల వివరాల నమోదు, గుర్తింపు ప్రక్రియను సులభతరం చేసేందుకు రూపొందిస్తున్న ప్రత్యేక వెబ్‌సైట్‌పై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. వెబ్‌సైట్ ప్రస్తుత స్థితి, ప్రారంభానికి పట్టే సమయం, పనులను వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు కల్పించే ప్రక్రియలో భాగంగా వెబ్‌సైట్‌ను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కమిటీ అభిప్రాయపడింది. వెబ్‌సైట్ ఏర్పాటుపై తదుపరి పురోగతిని త్వరలో మరోసారి సమీక్షించి, ప్రారంభ తేదీతో పాటు తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని కమిటీ సభ్యులు వెల్లడించారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.