రక్తదానం ప్రాణదానంతో సమానంః వి. హనుమంతరావు
సూర్య, తెలంగాణ, బ్యూరో ప్రతినిధిః ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు ప్రారంభించారు. టీపీసీసీ ఫిషర్‌మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వి. హనుమంతరావు మాట్లాడుతూ రక్తదానం అత్యంత గొప్ప సామాజిక సేవ అని, ఒకరు చేసే రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడే అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకోవాలని, ఆరోగ్యపరంగా అర్హులైన వారు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమన్నారు. మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో వివిధ జిల్లాలకు చెందిన ఫిషర్‌మెన్ కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. మత్స్యకారుల సంక్షేమం, హక్కుల పరిరక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ మత్స్యకార కాంగ్రెస్ ముందుండటం ప్రశంసనీయమని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం ద్వారా మత్స్యకార కాంగ్రెస్ నాయకులు మానవతా విలువలు, సేవా స్ఫూర్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రక్తదాతలను నిర్వాహకులు అభినందించారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.