andhrapradesh
మత్స్య సంపద పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన
అవనిగడ్డ,మేజర్ న్యూ స్: ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆక్వాకల్చర్ విభాగం ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు స్థానిక ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌ను సందర్శించి ఆక్వా రంగంలో చేపట్టే పరీక్షలు, వ్యాధుల నివారణ చర్యలపై అవగాహన పొందారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సుజాత మాట్లాడుతూ.. మత్స్యకారుల జీవనాధారమైన మత్స్య సంపదను, జల వనరులను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. సముద్రంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ప్రజలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్న మత్స్యకారుల శ్రమ వెలకట్టలేనిదన్నారు. నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలని, మత్స్య సంపదను భవిష్యత్ తరాల కోసం కాపాడుకోవాలని విద్యార్థులకు సూచించారు.
అనంతరం ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లో ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ నాగభద్రరావు, ల్యాబ్ టెక్నీషియన్లు షారున్, హేమలత విద్యార్థులకు ల్యాబ్ పనితీరును వివరించారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, చేపలు, రొయ్యలకు వచ్చే వ్యాధుల నివారణ, చెరువు నీటి నాణ్యత పరీక్షల గురించి వివరించారు. ముఖ్యంగా పీహెచ్, లవణీయత, టర్బిడిటీ వంటి నీటి నాణ్యత ప్రమాణాలను పరీక్షించే విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు.ఈ కార్యక్రమంలో ఆక్వాకల్చర్ విభాగ అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.