రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలి
రామాయంపేట : రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని తిరిగి పునరుద్ధరించి, ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని బీజేపీ జిల్లా నాయకుడు, అసెంబ్లీ నియోజకవర్గ పునరుద్ధరణ ప్యాకేజీ పోరాట సమితి కో-కన్వీనర్ సిద్ధరాములు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెదక్ జిల్లాలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సిద్ధరాములు మాట్లాడుతూ.. చారిత్రక ప్రాధాన్యత కలిగిన రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని పునరుద్ధరించడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు పరిపాలనా సౌలభ్యంతో పాటు అభివృద్ధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. మెదక్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, జిల్లాలోని పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.రామాయంపేట నియోజకవర్గ పునరుద్ధరణ, మెదక్ జిల్లా అభివృద్ధి, పర్యాటక రంగానికి నిధుల కేటాయింపు వంటి ప్రధాన డిమాండ్ల సాధన కోసం గ్రామగ్రామాన ప్రజలను చైతన్యపరుస్తూ ఉద్యమాన్ని చేపడతామని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం గుర్తించి రామాయంపేట నియోజకవర్గ పునరుద్ధరణపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని సిద్ధరాములు కోరారు.