ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి కళాశాలను సందర్శించిన యూఎస్ఎఫ్ఐ నాయకులు
కొల్చారం …మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జగన్, వర్కింగ్ ప్రెసిడెంట్ అజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిశీలించి మాట్లాడారు.
కళాశాలలో తాగునీటి సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల మైదానంలో చెత్తాచెదారం, రాళ్ల గుట్టలు పేరుకుపోవడంతో విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారని తెలిపారు. అలాగే వాష్‌రూమ్‌ల నిర్వహణ సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఈ సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కళాశాలలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల కమిటీ సభ్యులు తేజ, వంశీ, కృష్ణ పాల్గొన్నారు.