రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు ఉమా వైష్ణవి ఎంపిక
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలోని శ్రీ పడాల పెద పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని తాటితూరి ఉమావైష్ణవి రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికైంది. గొల్లల మామిడాడలో నిర్వహించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండర్–19 నెట్‌బాల్ ఎంపిక పోటీల్లో ఉమావైష్ణవి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు ద్వారంపూడి యువరాజారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆమె సీనియర్ ఎంపీసీ విద్యార్థినిగా చదువుతోంది.ఈ నెల 22, 23 తేదీల్లో విజయనగరం జిల్లా గంటి ప్రాంతంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ నెట్‌బాల్ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జట్టు తరఫున ఉమావైష్ణవి పాల్గొననుందని పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు నాగబాబు వెల్లడించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు క్రీడల్లోనూ ప్రత్యేక శిక్షణ అందిస్తూ, వారి ప్రతిభను వెలికితీసి ఉన్నత స్థాయికి చేరుకునేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. పాఠశాల విద్యార్థిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందని, రాబోయే పోటీల్లో కూడా విజయం సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.విద్యార్థినికి నెట్‌బాల్‌లో శిక్షణ అందించి ఎంపికయ్యేలా కృషిచేసిన వ్యాయామ ఉపాధ్యాయులు ద్వారంపూడి యువరాజారెడ్డి, భీమేశ్వర్‌రెడ్డిలను పలువురు అభినందించారు. ఎంపికైన ఉమావైష్ణవితో పాటు ఆమెకు శిక్షణ అందించిన ఉపాధ్యాయులను పందలపాక అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోణాల సత్తిరాజు, ఉపాధ్యాయ ప్రతినిధి కర్రి వీర్రెడ్డి, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ పంపన వీర సత్యనారాయణ, కళాశాల అధ్యాపకులు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థినీ విద్యార్థులు అభినందించారు.