రైతుకు నష్టం జరగకుండా చూడాలి. పూర్తి స్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ జరగాలి. మంత్రి గొట్టిపాటి.
సూర్య న్యూస్ అద్దంకి.
మురసు తుపానుతో నష్టపోయిన ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వ సహాయం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తుపాను ప్రభావం, విద్యుత్ వ్యవస్థకు జరిగిన నష్టం, వ్యవసాయ, ఉద్యాన పంటలు, రహదారుల పరిస్థితిపై సంతమాగలూరు మండలం పుట్టావారిపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో మంత్రి గొట్టిపాటి బుధవారం సమీక్ష నిర్వహించారు. తుపానుతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనుల పురోగతిని మంత్రి గొట్టిపాటి అడిగి తెలుసుకున్నారు. గృహ విద్యుత్ సరఫరా పునరుద్ధరణ దాదాపు పూర్తయిందని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్ల మరమ్మతులను మరింత వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యుత్ సరఫరా లేక సాగునీరు అందక ఏ ఒక్క రైతు పంట కూడా దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
నష్టంపై సమగ్ర అంచనాలతోనే పరిహారం..…
ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో మురసు తుపానుతో జరిగిన వ్యవసాయ పంటల నష్టాన్ని పంటల వారీగా అంచనా వేయాలని మంత్రి గొట్టిపాటి అధికారులను ఆదేశించారు. వరి, పత్తి, మిరప, మినుము, శనగ, పొగాకు తదితర పంటలకు జరిగిన నష్టాన్ని గుర్తించడంతోపాటు.. దెబ్బతిన్న విస్తీర్ణం, నష్టపోయిన రైతులందరి వివరాలను నమోదు చేయాలన్నారు. కోత దశలో ఉన్న పంటలు, నేలకొరిగిన పంటలు, నీట మునిగిన పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ నష్టం వివరాలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. అరటి, బొప్పాయి, కూరగాయలు తదితర ఉద్యాన పంటలకు జరిగిన నష్టాన్ని కూడా సమగ్రంగా అంచనా వేయాలన్నారు. దెబ్బతిన్న తోటలు, పంటల విస్తీర్ణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిశీలించి పారదర్శకంగా నివేదికలు రూపొందించాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులకు స్పష్టం చేశారు. నష్టపోయిన ప్రతి రైతుకు కూటమి ప్రభుత్వం నుంచి సత్వర సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ తదితర ప్రయోజనాలు రైతులకు త్వరితగతిన అందేలా సమగ్ర నివేదికలను సిద్ధం చేసి సమర్పించాలని ఆయన ఆదేశించారు.
రోడ్ల మరమ్మతులు వేగవంతం చేయాలి..…
మురసు తుపానుతో అద్దంకి నియోజకవర్గంలో దెబ్బతిన్న ప్రధాన రహదారులు, గ్రామీణ అంతర్గత రోడ్ల పరిస్థితిని ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్షించారు. రహదారుల మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ ప్రయాణాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, ప్రజలు ఇబ్బందులు పడకుండా రహదారుల పునరుద్ధరణ పనులు వేగవంతంగా చేపట్టాలన్నారు. విద్యుత్, వ్యవసాయ, ఉద్యానవన, ఆర్ అండ్ బీ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కృషి చేయాలని మంత్రి గొట్టిపాటి సూచించారు.