పుస్తక ఆకారంలో విద్యార్థుల వినూత్న ప్రదర్శన.. * విజ్ఞాన భారతి పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవం *
నరసన్నపేట, సూర్య : భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని నరసన్నపేటలోని విజ్ఞాన భారతి పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన వినూత్న ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్య ప్రాముఖ్యతను, పుస్తక పఠనం ద్వారా లభించే విజ్ఞానాన్ని సమాజానికి చాటిచెప్పే ఉద్దేశంతో విద్యార్థులంతా కలిసి పుస్తక ఆకారంలో కూర్చుని ప్రదర్శన నిర్వహించారు. దేశ భవిష్యత్తు నిర్మాణంలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని, పుస్తకాలు విజ్ఞానానికి నిధులని ఈ ప్రదర్శన ద్వారా చాటిచెప్పారు. విద్యార్థుల సమిష్టి ఆలోచన, సృజనాత్మకతను ఈ కార్యక్రమం ప్రతిబింబించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానాచార్యులు డి. ఢిల్లేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను సాధించడానికి నిరంతర అధ్యయనం ఎంతో అవసరమని, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని విద్యారంగంలో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీదేవి, రమణమూర్తి, శైలజ, అరుణకుమారి, సూర్యనారాయణ, అనురాధ, హేమకుమారి, అంజలి, రేవతి తదితరులు పాల్గొన్నారు.