అధిక ధరలకు నిత్యావసరాల విక్రయం.. 10 కేసులు నమోదు
ఒంగోలు, మేజర్ న్యూస్ : నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తూ వినియోగదారులను దోచుకుంటే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మించి సరుకులు విక్రయిస్తున్న వ్యాపారులపై కొరడా ఝళిపించారు. డైరెక్టర్ జనరల్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజయవాడ ఆదేశాల మేరకు ప్రకాశం, మార్కాపురం జిల్లాల విజిలెన్స్ ఎస్పీ ఆధ్వర్యంలో ఒంగోలు విజిలెన్స్ అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి కందుకూరు, కనిగిరి పట్టణాల్లోని బియ్యం, నిత్యావసర వస్తువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధిక ధరలకు వస్తువులు విక్రయించడం, ప్యాకేజీ ఉత్పత్తులపై తప్పనిసరిగా ఉండాల్సిన ధర, బరువు తదితర వివరాలతో కూడిన డిక్లరేషన్లు లేకపోవడం, ఇతర నిబంధనల ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. దీంతో సంబంధిత వ్యాపారులపై లీగల్ మెట్రాలజీ చట్టం కింద మొత్తం 10 కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం సుమారు రూ.3,00,464 విలువైన సరుకుల విక్రయాలను నిలిపివేశారు. నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ చేయడం, కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, లీగల్ మెట్రాలజీ, పౌరసరఫరాలు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.