స్థానిక ఎన్నికల్లో ‘రెడ్ బుక్’ రాజ్యాంగం అమలు: సీపీఐ, సీపీఎం ధ్వజం
* నెల్లూరులో వామపక్షాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ
* పోలీసులే కూటమి ఏజెంట్లుగా మారారని నేతల ఆగ్రహం
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్
రాష్ట్రంలో కూటమి పాలకులు స్థానిక సంస్థల ఎన్నికలను తమ కనుసన్నల్లోనే నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు అరిగెల సాయి, మూలం రమేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నేతలు రాజ్యాంగానికి బదులు ‘రెడ్ బుక్’ రాజ్యాంగాన్ని అమలు చేశారని మండిపడ్డారు. వామపక్ష పార్టీల రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎన్నికల అక్రమాలపై బుధవారం నెల్లూరు నగరంలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టి, అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా వామపక్ష నేతలు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం ఏమాత్రం లేదని, కేవలం పోలీసులు, అధికార పార్టీ గూండాల పెత్తనమే సాగిందని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియను పూర్తిగా ఏకపక్షంగా మార్చి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విచ్చలవిడిగా డబ్బు పంపిణీ, అక్రమ కేసులు, బెదిరింపులకు పాల్పడి అప్రజాస్వామిక విధానాలను ప్రోత్సహించారని నేతలు విమర్శించారు. పోలింగ్ కేంద్రాల్లోనే కాకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా అధికార పార్టీ నాయకులు, గూండాలు స్వైరవిహారం చేశారని తెలిపారు. రాబోయే పంచాయతీ ఎన్నికలనైనా అధికారులు నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ప్రజలందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యురాలు కె. వినోదమ్మ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నందిపాడు రమణయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే సీపీఎం నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, కత్తి శ్రీనివాసులు, పాటు పలువురు వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.