విద్యుత్ మోటార్ల దొంగల ముఠా అరెస్టు
మోత్కూర్, మేజర్ న్యూస్: రైతుల వ్యవసాయ మోటార్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను మోత్కూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.2 లక్షల విలువైన 18 విద్యుత్ మోటార్లతో పాటు దొంగతనాలకు ఉపయోగించిన వాహనం,ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోత్కూరు,అడ్డగూడూరు, తిరుమలగిరి,రామన్నపేట పోలీస్ స్టేషన్ల పరిధిలోని వివిధ గ్రామాల్లో వ్యవసాయ బోర్ల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్ల దొంగతనానికి ఈ ముఠా పాల్పడ్డట్లు తెలిపారు. నిందితులు తిరుమలగిరి,మోత్కూర్ పరిసర గ్రామాలకు చెందిన ఒగ్గు నాగరాజు,రావాని రమేష్,రావాని శ్రీను,పల్లపు మహేందర్ ముందుగా గ్రామాల శివార్లలో పగటిపూట రెక్కీ నిర్వహించి,రాత్రి వేళల్లో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి మోటార్లను తొలగించి దొంగతనాలకు పాల్పడేవారని,వాటిని వివిధ ప్రాంతాల్లో పాత ఇనుప సామాను కొనుగోలు చేసే వారికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అక్షాంశ్ యాదవ్, అదనపు ఎస్పీ లక్ష్మీ నారాయణ పర్యవేక్షణలో,చౌటుప్పల్ డీఎస్పీ పి మధుసూదన్ రెడ్డి,రామన్నపేట సీఐ ఎం రవి ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు చేపట్టారు.మోత్కూరు ఎస్‌ఐ కె. సతీష్ కుమార్,సిబ్బంది సునీల్, శివ, రవి, అనిల్,అఫ్సర్,అజీల్,ప్రవీణ్ తదితరులు నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించారు.ఈ సందర్భంగా పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.