శెట్టిపాలెం వద్ద ఆర్టీసీ బస్సు–ధాన్యం ట్రాక్టర్ ఢీ.. 12 మందికి గాయాలు
తృటిలో తప్పిన భారీ ప్రమాదం.. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమం
మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్:
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ సమీపంలోని మహేంద్ర రైస్ మిల్లు వద్ద బుధవారం భారీ రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 12 మంది గాయపడ్డారు.
ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న వేములపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.