ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటల సాగు.. - నవార దేశీ వరి సాగు చేసిన రైతుకు సన్మానం
సూర్య – పెద్దపల్లి రూరల్ :
రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగంతో పెట్టుబడి వ్యయం పెరగడమే కాకుండా భూసారం తగ్గి పంట దిగుబడులు పడిపోతున్నాయని ఏడీఏ శ్రీనాథ్ అన్నారు. బుధవారం పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం (ఎన్‌ఎంఎన్‌ఎఫ్)లో భాగంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో నవార దేశీ వరి సాగు చేసిన రైతు ముండేద్దుల జగన్ పొలాన్ని వ్యవసాయ శాఖ అధికారులు సందర్శించారు.
ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ రసాయన వ్యవసాయంతో రైతులకు అధిక పెట్టుబడి భారం పడటంతో పాటు ప్రజల ఆరోగ్యం, నేల సారం, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్నాయని తెలిపారు. దేశీ ఆవు పేడ, మూత్రంతో ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు ఉపయోగించకుండా వరి సాగు చేసి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచిన జగన్‌ను ఏడీఏ శ్రీనాథ్, ఎంఏఓ నాగార్జున, సర్పంచ్ ఓదెల శ్రీనివాస్‌లు శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఏఈఓలు సౌమ్య, వినయ్ కుమార్, రైతులు చెలుకల సదయ్య, పెంచాల శ్రీకాంత్, వివేక్, రాయమల్లు, సమ్మయ్య, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.