ఐఎన్ఎస్ డేగాలో మంత్రి నారా లోకేష్‌కు స్వాగతం పలికిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర
విశాఖపట్నం/పార్వతిపురం, సూర్య : ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతమిచ్చే లక్ష్యంతో నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు 2026కు రాష్ట్రం సిద్ధమైంది. ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులు విశాఖపట్నానికి చేరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో సదస్సులో పాల్గొనేందుకు విశాఖపట్నంలోని నౌకాదళ విమానాశ్రయం ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రి నారా లోకేష్కు పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర సహచర మంత్రులు, శాసనసభ్యులతో కలిసి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌కు ఎమ్మెల్యే విజయచంద్ర స్వాగతం పలికి, సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయనకు అభినందనలు తెలిపారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ భాగస్వామ్య సదస్సు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి, అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణకు కీలక వేదికగా నిలవనుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పారిశ్రామిక రంగంలో అభివృద్ధి, నూతన సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాల కల్పన, యువతకు ఉపాధి అవకాశాల విస్తరణ వంటి అంశాలకు ఈ సదస్సులో ప్రాధాన్యత లభించనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ సదస్సుపై పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది.