మార్కాపురం తొలి జెడ్పీ చైర్మన్‌కు ఘన సన్మానం
- కందుల రామిరెడ్డిని కలిసిన అడుసుమల్లి, గుంటుపల్లి
పామూరు, మేజర్ న్యూస్ :
నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లా పరిషత్ తొలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న కందుల రామిరెడ్డిని తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి, టిడిపి క్లస్టర్-10 ఇన్‌చార్జి గుంటుపల్లి శ్రీనివాసులు బుధవారం మార్కాపురంలోని ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కందుల రామిరెడ్డికి శాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలియజేశారు. నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాలో జిల్లా పరిషత్ అభివృద్ధికి గ్రామీణ ప్రాంతాల ప్రగతికి ఆయన నాయకత్వం దోహదపడాలని ఆకాంక్షించారు. కొత్త జిల్లాలో ప్రజాప్రతినిధుల సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు మరింత ముందుకు సాగాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.