భూ రికార్డుల్లో తప్పులకు తావొద్దు జనవరి 31లోగా గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి చేయాలి
సూర్య స్టేట్ అమరావతి : భూముల రీ-సర్వే ప్రక్రియలో వందశాతం లక్ష్యాన్ని సాధించడంతో పాటు భూ రికార్డుల్లో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని సీసీఎల్ఏ కమిషనర్ జి. జయలక్ష్మి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీలోగా గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. బుధవారం భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం జిల్లాలో భూముల రీ-సర్వేను నూరు శాతం పూర్తి చేయాలని సూచించారు. రీ-సర్వే అనంతరం చేపట్టే క్షేత్రస్థాయి పరిశీలనలో భూముల వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ఖచ్చితత్వంతో గ్రౌండ్ ట్రూతింగ్ చేపట్టాలని ఆదేశించారు. వెబ్‌ల్యాండ్ పోర్టింగ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, రైతుల భూ రికార్డులకు సంబంధించి ఈ-కేవైసీ, ఆధార్ సీడింగ్ ప్రక్రియలను వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతు భూ రికార్డుకు సంబంధించిన ప్రక్రియ కూడా పెండింగ్‌లో ఉండకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు.