PMR హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్‌పై సమగ్ర విచారణ జరిపించాలి :ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు హేమా సుదర్శన్ జిల్లోజు డిమాండ్
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీకి చెందిన నర్సింగ్ హాస్టల్‌లో విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌కు గురైన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు హేమా సుదర్శన్ జిల్లోజు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
బుధవారం ఆమె విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ.. మీడియా కథనాల ప్రకారం సుమారు 100 మందికి పైగా విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారని, వారిలో 16 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం ఉందన్నారు. అయితే వాస్తవంగా ఎంతమంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారో ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాలని కోరారు. బాధితుల సంఖ్యపై స్పష్టత ఇవ్వడంతో పాటు విద్యార్థినులందరికీ మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు.
విద్యార్థినుల ఆరోపణల ప్రకారం ముందుగా తయారుచేసిన చికెన్, బగారా రైస్‌ను తిరిగి రాత్రి భోజనంలో వడ్డించడం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. మరోవైపు బయటి ఆహారం తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని కాలేజీ యాజమాన్యం చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అసలు కారణాలను నిగ్గు తేల్చేందుకు ఆహారం, తాగునీటి నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల నుంచి లక్షల రూపాయల ఫీజులు, హాస్టల్ ఛార్జీలు వసూలు చేస్తున్న యాజమాన్యం వారికి నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, సురక్షితమైన తాగునీరు కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదా ఉచిత సీట్లు పొందిన విద్యార్థుల నుంచి సైతం హాస్టల్ ఫుడ్ పేరుతో సుమారు రూ.1.50 లక్షల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరారు.
ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని, బాధిత విద్యార్థినులందరి వివరాలను అధికారికంగా ప్రకటించాలని, హాస్టల్ వంటగది, ఆహార నాణ్యత, తాగునీటి సరఫరా, పరిశుభ్రతపై తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న హాస్టల్ ఫీజులు, ఫుడ్ ఛార్జీలపై ఆడిట్ నిర్వహించాలన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ మెడికల్, నర్సింగ్ కళాశాలల హాస్టళ్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి విద్యార్థుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సందర్భంగా కాలేజీని సందర్శించేందుకు స్టేట్ కిసాన్ వింగ్ అధ్యక్షుడు నీరెడ్డి ఆంజనేయులు, రాష్ట్ర నాయకుడు బాబూలాల్ పవర్‌తో పాటు పలు ప్రజాసంఘాల ప్రతినిధులు కూడా వచ్చారని తెలిపారు.
విద్యార్థుల ఆరోగ్యం, ప్రాణాల కంటే ఏ ఫీజులూ, వ్యాపార ప్రయోజనాలూ గొప్పవి కావని హేమా సుదర్శన్ జిల్లోజు పేర్కొన్నారు.
వడ్ల శ్రీనివాస చారి, రంగారెడ్డి - మేజర్ న్యూస్