యువత సేవా దృక్పథంతో సమాజాభివృద్ధికి కృషి చేయాలి: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్: యువత నిస్వార్థ సేవాభావం, అంకితభావం, క్రమశిక్షణతో సమాజాభివృద్ధికి కృషి చేయాలని జనగామ ఎమ్మెల్యే, అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, సమగ్ర అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని, సేవా కార్యక్రమాల ద్వారా దేశ పురోగతికి తోడ్పడాలని సూచించారు.ఘట్‌కేసర్‌లోని అనురాగ్ యూనివర్సిటీలో పశ్చిమ మండల జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ప్రీ రిపబ్లిక్ డే క్యాంప్–2026 బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాలు యువతలో సేవాభావం, నాయకత్వ లక్షణాలు, జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని తెలిపారు.ఈ శిబిరంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాలతో పాటు వివిధ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, ప్రోగ్రామ్ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మహిళా భద్రతా విభాగం డీసీపీ ఉషారాణి మాట్లాడుతూ మహిళా భద్రత, సామాజిక బాధ్యత, క్రమశిక్షణపై యువత అవగాహన కలిగి ఉండాలని సూచించారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి నాయకత్వ లక్షణాలు, దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం గురించి వివరించారు.ఎన్‌ఎస్‌ఎస్ ప్రాంతీయ సంచాలకులు, శిబిర డైరెక్టర్ ఆర్. సైదా స్వాగతం పలుకగా, యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త డాక్టర్ సి. మల్లేశ కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిబిరం ద్వారా యువతలో సేవాభావం, నాయకత్వ లక్షణాలు, జాతీయ సమైక్యత మరింత పెంపొందుతాయని నిర్వాహకులు తెలిపారు.