అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం షెడ్డు, మరుగుదొడ్లు నిర్మించిన కుమ్మరి ధన్‌రాజ్, నాయకపు గంగారం
కీసర, మేజర్ న్యూస్: అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తులు, మాలధారణ చేసిన స్వాములకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కీసరలోని శ్రీ వరాల అయ్యప్ప స్వామి దేవస్థానంలో దాతలు ముందుకొచ్చారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా తమ వంతు సహకారం అందించి భక్తులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించారు.కీసర గ్రామానికి చెందిన కుమ్మరి ధన్‌రాజ్–శోభారాణి దంపతులు తమ తల్లిదండ్రులు కీ.శే. కుమ్మరి కిష్టయ్య, పుష్పమ్మ జ్ఞాపకార్థం సుమారు రూ.2 లక్షల వ్యయంతో ఆలయ ప్రాంగణంలో షెడ్డు నిర్మించి అందించారు. ధన్‌రాజ్ ఆర్‌అండ్‌బీ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆలయ నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు స్పందించి ఈ సేవా కార్యక్రమానికి సహకరించారు.అదేవిధంగా నాయకపు గంగారం తన సొంత ఖర్చులతో ఆలయ ప్రాంగణంలో రెండు మరుగుదొడ్లు, రెండు స్నానపు కుళాయిలను ఏర్పాటు చేయించారు. దీంతో అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములతో పాటు ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.బుధవారం గురుస్వాముల చేతుల మీదుగా నూతనంగా నిర్మించిన షెడ్డు, మరుగుదొడ్లు, స్నానపు కుళాయిలను ప్రారంభించారు. భక్తుల అవసరాలను గుర్తించి సేవా కార్యక్రమాలు చేపట్టిన దాతలను ఆలయ నిర్వాహకులు, భక్తులు అభినందించారు. దాతల కుటుంబాలపై శ్రీ వరాల అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గురుస్వాములు నల్ల బాల్‌రెడ్డి, చిలుక గురుస్వామి, నాయకపు గంగారం, శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ మాజీ చైర్మన్ నాయకపు వెంకటేష్, మాజీ ఎంపీటీసీ జంగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.