చిన్నారుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడి టీచర్లకు ప్రత్యేక శిక్షణ
చిన్నారుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక శిక్షణ
కేవీబీపురం.న్యూస్,నవంబర్ 11
చిన్నారుల బాల్య దశ నుంచే వారి శారీరక, మానసిక, సామాజిక వికాసానికి పటిష్ఠమైన పునాది వేయాలనే లక్ష్యంతో అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని సీడీపీఓ రాజేశ్వరి(ఎఫ్‌ఏసీ) ఆధ్వర్యంలో నిర్వహించరు. ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ పుట్టినప్పటి నుంచి మూడు సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు అందించాల్సిన ప్రారంభ బాల్య ఉద్దీపన కార్యక్రమాలు, మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు అవసరమైన ప్రాథమిక అభ్యాస నైపుణ్యాలు, ఆటల ఆధారిత బోధన వంటి కీలక అంశాలను శిక్షణలో వివరించారు. బాలల తొలి దశలోనే వారి అభ్యాస సామర్థ్యాన్ని గుర్తించి, వయస్సుకు అనుగుణంగా తగిన కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా వారి సమగ్ర వికాసానికి తోడ్పడవచ్చని ఆమె తెలిపారు.ముఖ్యంగా మూడు నెలల వయస్సు నుంచే శిశువులు తల్లి ముఖాన్ని గుర్తించడం ప్రారంభిస్తారని, చిన్నారులకు తొలి నుంచే ప్రేమతో కూడిన సంరక్షణ, సరైన ప్రేరణ అందించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. బాల్యంలో అందించే సరైన ఉద్దీపన భవిష్యత్తులో పిల్లల అభ్యాసం, ప్రవర్తన, నైపుణ్యాల అభివృద్ధిపై సానుకూల ప్రభావం చూపుతుందని వివరించారు.చిన్నారుల్లో తొలి దశ నుంచే నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచడం, వయస్సుకు తగిన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, తల్లిదండ్రులకు ఇంటి ఆధారిత అభ్యాస కార్యకలాపాలపై అవగాహన కల్పించడం వంటి అంశాలకు శిక్షణలో ప్రాధాన్యత ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా సరైన మార్గదర్శకత్వం అందించాల్సిన బాధ్యత ప్రతి అంగన్వాడీ కార్యకర్తపై ఉందని ఆమె తెలిపారు.కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రవికుమార్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కునాటి సురేష్, సూపర్వైజర్లు బజావతి, కల్పలత,ఉపాధ్యాయులు శంకరయ్య, గిరీష్‌కుమార్, తుకారం, మహిళా సంరక్షణ కార్యదర్శులుపాల్గొన్నారు.