గ్రామపంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంజిల్లాలో గ్రామ పంచాయతీలకు రెండవ సాధారణ ఎన్నికలు నిర్వహణకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. ఎన్నికల విధులు నిర్వహించే రిటర్నింగ్ అధికారులు , సహాయ రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నియమ నిబంధనలు, విధులు, బాధ్యతలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణను పురస్కరించుకుని నిర్వహించిన రిటర్నింగ్ అధికారుల స్టేజ్–1 శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి అంశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. నామినేషన్ల స్వీకరణ నుంచి అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ, గుర్తుల కేటాయింపు వరకు ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించనున్నారు.
మొదటి విడతకు నవంబర్ 13న, రెండవ విడతకు నవంబర్ 16న, మూడవ విడతకు నవంబర్ 19న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. సంబంధిత రిటర్నింగ్ అధికారులు నవంబర్ 15, 18, 21 తేదీల్లో ఎన్నికల నోటీసులు జారీ చేస్తారు. నామినేషన్ల స్వీకరణకు వరుసగా నవంబర్ 17, 20, 23 తేదీలు చివరి తేదీలుగా నిర్ణయించారు. నామినేషన్ల పరిశీలన నవంబర్ 18, 21, 24 తేదీల్లో నిర్వహిస్తారు. నామినేషన్ల తిరస్కరణపై అప్పీళ్ల స్వీకరణ, పరిష్కారం వరుసగా నవంబర్ 19, 20; నవంబర్ 22, 23; నవంబర్ 25, 26 తేదీల్లో జరుగుతుందన్నారు.
అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు, తుది పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రచురణకు వరుసగా నవంబర్ 21, 24, 27 తేదీలు నిర్ణయించారు. మొదటి విడత పోలింగ్ నవంబర్ 26న, రెండవ విడత పోలింగ్ నవంబర్ 29న, మూడవ విడత పోలింగ్ డిసెంబర్ 2న నిర్వహించనున్నారు. అవసరమైన చోట రీపోలింగ్‌ను వరుసగా నవంబర్ 27, 30, డిసెంబర్ 3 తేదీల్లో నిర్వహించేందుకు షెడ్యూల్‌లో పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన పోలింగ్ జరిగిన రోజునే చేపట్టనున్నారు.గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల విధులను రెండు దశలుగా విభజించినట్లు శిక్షణలో వివరించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వి. శాంతకుమారి, జిల్లా అభివృద్ధి అధికారి కె. రత్నకుమారి, డీఎల్‌డీవోలు పి. వీణాదేవి, కె. శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎం. రాజు, టూరిజం ప్రాంతీయ సంచాలకులు ఎన్.వి.వి.ఎస్. మూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు.