నల్లగొండకు 480 ఇందిరమ్మ టవర్స్ ఇళ్లు మంజూరు -
ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన మేయర్ బుర్రి చైతన్య
నల్లగొండ టౌన్, మేజర్ న్యూస్:నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కు 480 ఇందిరమ్మ టవర్స్ ఇళ్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 579 విడుదల చేసింది. ఈ నిర్ణయంపై నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నల్లగొండ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సొంత ఇల్లు లేని పేద, ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చడమే ఇందిరమ్మ టవర్స్ పథకం ముఖ్య ఉద్దేశమని మేయర్ తెలిపారు. నల్లగొండ పట్టణంలోని అర్హులైన పేద కుటుంబాలకు ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.
ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయం రూ. 8.50 లక్షలుగా నిర్ణయించగా, అర్హులైన లబ్ధిదారులకు రూ. 5 లక్షల సబ్సిడీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నల్లగొండ పట్టణ అభివృద్ధితో పాటు పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కృషి చేస్తుందని మేయర్ పేర్కొన్నారు.