పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం.. అప్రమత్తంగా ఉండాలి! అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోండి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి ; చలికాలంలో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ సూచించారు. అత్యవసరమైతే తప్ప పొగమంచు సమయంలో ప్రయాణాలు చేయవద్దని, వీలైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు.శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో రహదారులపై దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని, ఎదురుగా వచ్చే వాహనాలు సైతం స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటల వరకు పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వాహనదారులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.పొగమంచు సమయంలో అధిక వేగంతో ప్రయాణించడం, అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వల్ల వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. వాహనదారులు వేగాన్ని తగ్గించి, ముందు వెళ్తున్న వాహనానికి తగినంత దూరం పాటించాలని సూచించారు.వాహనాలు నడిపేటప్పుడు హెడ్‌లైట్లు, ఇండికేటర్లు తప్పనిసరిగా వినియోగించాలని, పొగమంచు సమయంలో లో బీమ్ లైట్లు ఉపయోగించాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు.ప్రయాణంలో తొందరపాటు వద్దు.. మీ భద్రతే మీ కుటుంబానికి భరోసా. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.