భూముల రీసర్వేలో తప్పులకు తావివ్వొద్దు!రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మెదక్ మేజర్ న్యూస్ ప్రతినిధి ; రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రక్రియను ప్రజలకు మేలు జరిగేలా, పూర్తి పారదర్శకతతో, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రీసర్వేలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తొందరపాటు నిర్ణయాలతో తప్పులకు తావివ్వకూడదని స్పష్టం చేశారు.బుధవారం హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో భూముల రీసర్వే ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి సమావేశంలో పాల్గొన్నారు.
నవంబర్ నెలాఖరులోగా తొలి విడత పూర్తి చేయాలి..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే పలుమార్లు రీసర్వేపై సమావేశాలు నిర్వహించడంతో పాటు ఉమ్మడి జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి రెవెన్యూ సమస్యలపై సమీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. రీసర్వే ఫలితాలు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వాస్తవ నివేదికలను సేకరిస్తున్నామని పేర్కొన్నారు.నవంబర్ నెలాఖరులోగా ప్రతి జిల్లాలో తొలి విడతలో ఎంపిక చేసిన 70 గ్రామాలతో పాటు నక్షా లేని గ్రామాల్లో కూడా రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. రీసర్వేకు రూపొందించిన ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని అధికారులు పక్కాగా అమలు చేయాలని సూచించారు. ఉన్నతాధికారులను సంతృప్తిపరిచే నివేదికలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా నివేదికలు రూపొందించాలని ఆదేశించారు.
మండలాల వారీగా ప్రత్యేక సర్వే బృందాలు..
రీసర్వే పనులను వేగవంతం చేసేందుకు ప్రతి మండలంలో ప్రత్యేక సర్వే బృందాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. అందుబాటులో ఉన్న లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, అవసరాన్ని బట్టి సర్వే బృందాల సంఖ్యను పెంచాలని సూచించారు. రాబోయే ఏడాదిన్నర కాలంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
రైతుల సమక్షంలోనే భూముల సర్వే..
రీసర్వే చేపట్టే గ్రామాల రైతులకు ముందుగానే సమాచారం అందించాలని, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు ముందస్తు నోటీసులు జారీ చేయడంతో పాటు అవసరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సర్వే నివేదికలపై అభ్యంతరాలు ఎక్కడ, ఎలా సమర్పించాలి? వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారనే విషయాలను ప్రజలకు ముందుగానే వివరించాలని ఆదేశించారు.
రీసర్వే పూర్తయిన గ్రామాల్లో సర్వే వివరాలను ప్రజలకు తెలియజేస్తూ దండోరా వేయించాలని, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు తగిన అవకాశం కల్పించాలని తెలిపారు. వచ్చిన అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.
కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలకు క్యూఆర్ కోడ్..
రీసర్వే పూర్తయిన ప్రాంతాల్లో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను క్యూఆర్ కోడ్‌తో అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలో భూముల సర్వే వివరాలు, రెవెన్యూ రికార్డుల్లో ఎలాంటి తప్పులు లేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
అసైన్డ్ భూముల పట్టాలపై సమగ్ర పరిశీలన.
అసైన్డ్ భూములకు సంబంధించి పట్టాలు అసలైనవా? నకిలీవా? అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. పట్టా పొందిన వ్యక్తులే ప్రస్తుతం ఆ భూములపై ఆధీనంలో ఉన్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించాలని తెలిపారు. గతంలో ఒకరికి పట్టా ఇచ్చినప్పటికీ ప్రస్తుతం మరొకరు భూమిని అనుభవిస్తున్నట్లయితే, ప్రస్తుత అనుభవదారుడు నిబంధనల ప్రకారం అర్హుడా కాదా అనే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.పట్టాలో పేర్కొన్న భూమి విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో ఉన్న విస్తీర్ణానికి మధ్య తేడాలు ఉంటే వాటిని గుర్తించి సరిచేయాలని తెలిపారు. సాగునీటి చెరువులు, రహదారులు, కుంటలు, ఇతర అభివృద్ధి పనుల కోసం గతంలో భూసేకరణ చేసిన భూములకు సంబంధించిన సర్వే నంబర్లలో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు.
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు..
రీసర్వే ప్రక్రియలో ఏ అధికారి అయినా అక్రమాలకు, అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని మంత్రి హెచ్చరించారు. బాధ్యులపై సస్పెన్షన్‌తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి భూ వివాదాలు తలెత్తకుండా రీసర్వేను పూర్తి నాణ్యతతో, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ డివిజన్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.