సేవకు గుర్తింపు .. పువ్వాడికి పట్టం!
పార్టీ కోసం పనిచేసిన నాయకుడికి ఎంపీపీ పీఠం
- చిలంకూరు ఎంపీటీసీగా ఏకగ్రీవ విజయం - 19న మండల పరిషత్ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకారం
పామూరు, మేజర్ న్యూస్ :
రాజకీయాల్లో పదవులు రావడం ఒక ఎత్తయితే వాటికి తగిన అర్హతను తన సేవలతో సంపాదించుకోవడం మరో ఎత్తు. పార్టీనే నమ్ముకుని కార్యకర్తలే బలంగా భావించి కష్టసుఖాల్లో వారికి అండగా నిలిచిన నాయకుడు పువ్వాడి వెంకటేశ్వర్లు.
తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా అంకితభావంతో పనిచేస్తూ మండల స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయనకు ఇప్పుడు ఎంపీపీ పదవి రూపంలో సముచిత గౌరవం దక్కనుంది. చిలంకూరు ఎంపీటీసీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పువ్వాడి వెంకటేశ్వర్లు పామూరు మండల పరిషత్ అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. గతంలో టీడీపీ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన పార్టీ బలోపేతానికి, కార్యకర్తల ఐక్యతకు విశేషంగా కృషి చేశారు. రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా పార్టీ పట్ల విధేయతను వీడకుండా నాయకులు కార్యకర్తలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ముందుకు సాగారు. పదవుల కోసం కాకుండా పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన ఆయనకు ఇప్పుడు కీలక బాధ్యత దక్కడం టీడీపీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపుతోంది. ఎంపీపీ పదవి ఓసీ జనరల్‌కు రిజర్వు కావడంతో ఆయన ఎంపికకు మార్గం సుగమమైంది. ఈ నెల 19న జరిగే ఎన్నికలో ఎంపీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. మండల రాజకీయాలపై అనుభవం గ్రామీణ ప్రాంతాల సమస్యలపై అవగాహన ఉన్న పువ్వాడి వెంకటేశ్వర్లు ఎంపీపీగా ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేస్తారని, ప్రజలకు అందుబాటులో ఉంటూ మండల పరిషత్‌కు సమర్థవంతమైన నాయకత్వం అందిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. పార్టీ కోసం సాగించిన ఆయన ప్రస్థానం ఇక ప్రజాసేవలోనూ మంచి ఫలితాలు అందిస్తుందని టీడీపీ శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.